Monday, October 4, 2010

naa paata kavitvam - 9

1995
ఆవిర్లు చిమ్మే అంతరంగం
పదునెక్కిన కొసలు 
ఊపిరి వేడెక్కి మండే హృదయం 
జవం జీవం కంటి అంచున చేరి
ఒక నిశ్శబ్ద యాత్రికునికై నిరీక్షణ 
విశ్వ గానంలో లీనమయ్యే 
నాలో లయ కోసం అన్వేషణ 
June 95
వ్యక్తీకరించలేని భావానివి నువ్వు 
నీ గురించి నాకు అసలు తెలియదు
కానీ నిన్ను తలచుకుంటే చాలు 
నా రక్తం పరవళ్ళు తొక్కుతుంది
ఒక సమాధి స్థితికి చేరుస్తుంది 

అసలు ఎవరు నువ్వు
దేవతవా, దేముడివా, శక్తివా , వ్యక్తివా
నా ఊహవా, ఆశవా, ఆనందానివా
నా ఇహానివా, పరానివా
నా భ్రమవా,  ఎవరు నువ్వు??
ఎందుకు నా నరాలపై నాట్యం చేస్తావు
నన్ను వేర్రేత్తిస్తావు
నవరసాలు ఒక్కసారే పలికిస్తావు

Feb '96
ఈ నీరవంలో నీ మువ్వల సడి 
ఆనందం దాచలేని నయనాంచలాల తడి
జీవితం నేర్పిన అవిశ్వాసం
తిరగనివ్వదు ధైర్యం చాలదు 
కనులు తెరిస్తే సత్యం ఏదైనా కావచ్చు 
ఇది కలలా కరగ కూడదు
కాని నీ ఉనికి ఒక భ్రమైతే
నాకు భ్రమే ఆనందం
కనులు తెరవను  - ఇలాగే
ఇదే కాంక్షలో కాలిపోతాను

No comments:

Post a Comment