Dec 92
ఇంతా చేసి నువ్వు
ఇదా తెలుసుకున్నది
నీకు సుఖమిచ్చే పనులా
నువ్వు చెయ్య దలుచుకున్నది ???
కాలం మారినా దేశం మారినా
కోరికలవే శరీరానికి
ఎంత అందంగా చెప్పినా
సున్నితంగా విప్పినా
సురత క్రీడ ఉద్రేకమేగా
ఎన్ని రంగులైనా వెయ్యి
ఎన్ని మలుపులైనా తిప్పు
రసాలు అవే, మారని
స్థాయీ భావాలు అవే
బుర్రంటూ ఉంటె నువ్వు
బ్రతుకుని తప్పు పట్టవు
ఆదర్శాన్ని ఆశయాన్ని
అవసరం తినేస్తుంది
తెల్లని నీ హృదయం మీద
సమాజం రకరకాల
ముద్రలేస్తుంది
ఇక్కడ ఇలాగే జీవించాలి
"పక్కవాడి కోసం బ్రతుకు"
అన్న సూక్తిని ప్రవచించిన
వివేకానందుడికి కూడా
విజ్ఞ్యానం పంచడానికి
పబ్లిసిటీ కావాలి
ఏదో చేసేననే భ్రమలోనే
చచ్చిపోతాడు మార్టీర్
ఈ క్షణం లో సత్యం అదే
ఇంకో క్షణానికి అసత్యం
క్షణక్షణం మారే విలువలకి
నువ్వేది గీటురాయంటావు
నాలోది మేచ్చేవాళ్ళు
నాకేదో రకంగా నచ్చే వాళ్ళు
వాళ్లే నా చుట్టూ చేరుతారు
దీన్ని గ్రూపిజం అంటావా
ఒక్కసారి చరిత్ర తిరగెయ్యి
వైవిధ్యం లేకపోతె
ఈ పురోగతి సాధ్యమా
నేను పిడివాడిని కాదు
నాకు సత్యం చెప్పు
జీవితానికి అనుభవాల
గీతలు దాటి అర్ధం చెప్పు
అంతవరకూ నేను
నా కోసమే బ్రతుకుతా
1993
ఒక ప్రకంపన
ఎక్కడో ఎద లోతుల్లో
అమరామ్రుతాన్ని
వెలికి తీసే ప్రయత్నంలో
నిజ రుజ గ్రస్తయైన
జరానంతర జీవాక్రుతి
ఆకటి చీకటి తెరపై
ఆవిష్కరింప చేసే
అసమాన మానస
వృధా వ్యధా చిత్రం
1993
అవును నా కవిత్వం నిరాశా వాదమే
అడుగడుగునా నిస్పృహ కనిపిస్తుంది నిజమే
మరి ఈ ప్రపంచంలో ఆనందిస్తున్నవాడెవడు
ఇంత అజ్ఞ్యానంతో నిండిన
ఈ ప్రపంచాన్ని ప్రేమతో అక్కున
చేర్చుకోవాలన్నందుకు నాకు
దొరికిన గొప్ప కానుక 'వేదన'
ఆలోచించనివాడు, పిచ్చివాడు
అవసరమన్నది లేనివాడు
ఆనందిస్తారు కాబోలు
అమాయకుడు కూడా (మరి ఈ అమాయకత్వం అంటె ఏమిటో )
No comments:
Post a Comment