సాంగ్ - 1
ప|| ఈ చినుకులలో నా మనసే ఈనాడు మురిసే
వలపులు కురిసేటి వేళ నా గుండెలోనా
మేఘాల రాగాలు పలికే
చ|| నా లోన లోలోన అలలాగా కదిలేటి
కలలాటి నా సఖియ రూపం
విరిసిన వెన్నెలలో, అలసిన కన్నులకు
ఆ రూపే పొగ మంచు ధూపం
చ || చిరునవ్వు సిగపువ్వు ఎడ చొచ్చు రీతిలో
విరిసింది నా చెలియ వదనం
తెలియని భావనలో రసధుని వాహినిలో
మునిగే నా భావ ప్రపంచం
సాంగ్ - 2
ప|| దాగేను చందమామ మేఘాల చాటున
పలికేను ప్రేమ రాగం నా గుండె లోతున
చ|| కరిగిపోనీ కాలమంతా
ఎగసిపడు కెరటం లాగ
ముదివిడిన హృదయం తో
చ|| దూరాన, చీకటి ఆకాశాన
మిణుకుమను తారల గీతం
వినిపించే ప్రేమ రాగం
సాంగ్ - 3
ప|| కలలను రేగనీకుమా
నా ప్రియా - - నా ప్రియా
చితికిన మనసులోన
చ|| తడిసిన తలపులేవో కలలకు బాసటగా
మిగిలిన జీవితాన జ్ఞ్యాపకం ఊపిరిగా
నిజం తెలిసీ మూగాపోయినా మమత మదిలోన
సాంగ్- 4
ప|| ఎలాగని సహించను ఈ వెన్నెల నీడ
ఒంటరితనాన జారిన క్షణాల
మరపురాని విలాపాల మాటున
చ|| ఏవో, చూపులేవో జాలిగా నను తాకగానే
ఆనందమోక క్షణము ఈ శిలను కరిగించి
కన్నీటి వెల్లువాయే
సోధించి నా మనసు సాధించి శూన్యం
మరీచికా చందమాయే
సాంగ్ - 5
ప|| విరజాజి పరిమళాలు విరితేనియ అనుభవాలు
ఈ వెన్నెల సోయగాలు మనసారగ గ్రోలలేని
ఒంటరినైనాను ప్రియా
చ|| వేసవి తాపాలలోన
కురిసిన ఈ విరుల వాన
రగిలించెను నా తలపే
నేనోన్టిగా సైపలేక
నీ చెంతకు రాలేక
విరహానల జ్వాలలో . . . . .. .
డైరీలలో కాలిపోయినది కాలిపోగా , రాంబాబు అటక ఎక్కించినది ఎక్కించగా నాకు గుర్తున్నంత మటుకు నా పాత కవిత్వం ఇదే - ఇంకేమైనా మిగిలిపోతే, తరువాత ఎప్పుడైనా కనిపిస్తే మళ్ళీ మీకు పంపిస్తాను - నన్ను తిట్టకుండా ఇన్నాళ్ళు నా బాధ భరించినందుకు - స్నేహితులుగా మీ ఔదార్యం మీరు చూపినందుకు ఇవే నా కృతజ్ఞ్యతలు
ముసాఫిర్ అఫ్ ఇండియా ఉరఫ్ కార్టూనిస్ట్ కాలేకపోయిన కామేశ్వరరావు (కా కా కా ) ఉరఫ్ కాముడు ఉరఫ్ శ్రీ సత్యసాయి వెంకటరమణ లలితా రమా కామేశ్వరీ రమేష్
No comments:
Post a Comment