Friday, February 22, 2013

New Poetry -21


ఏదో మళ్ళీ mood తెచ్చుకుని వ్రాద్దామంటే బయటపడింది అదే గోల ఇంకోలా

కనికరం లేని ఈ నిశీధిలో,పోకారు బ్రతుకు కలల కాణాచి
ఈరువు కోరలు ఆసరాకలిగి, నరాలరవాలు హృదయభేదకం 
శ్వాసవేడిలో కరిగి నీరవం, కనులనేమార్చి వడచు కన్నీట
పసరించి వెలిసి, పొరాడి అలిసి, బయటపడలేక భయపెడుతోంది
ఆ చిరునవ్వుకి, ఆ పులకింతకి, ఈ వలవంతకి, ఈ పెనుబాధకి
ఘనీభవించిన కాఠిన్యానికి కారణభూతం ఏ మూర్తి తత్వం
అర్ధం కానిది అర్ధమైనదని, తెలుసనొకసారి, తెలియకోసారి
విధి అభేద్యమని విసిగివేసారి, తడబడి విడివడి బుగులు మేదస్సు
ధనం మదంతో గడిపి కొన్నాళ్లు, ఇంద్రియ సుఖమే పరమావధిగా
అధికారంలో కులికి కొన్నాళ్లు, ఏదో కోరిక తీరినట్టుగా
వినోదమొకపరి, విషాదమొకపరి, ఏదో అవసరమొచ్చినట్టుగా
పరుగిడి పరుగిడి వగర్చుకుంటూ, ఐహిక వాంఛల తెరలు బాధలకు
నలిగి నీరైన సగటు జీవితం, రాలి మోడైన నిష్ఫల వృక్షం
ఆనందంగా బ్రతుకుతున్నట్టు కృత్రిమ వేషం అభినయించనిక
సమాజ శ్రేయం, పరోపకారం, ఆత్మ సంస్కార యోగ విధానం
ఒకటా రెండా ఎన్నో రీతులు, కళల గొణగొణలు చరమ గీతికలు
ఈశ్వర ధ్యానం జగదానందం, సంత జనుడనని పాకులాడనా
వైరాగ్యంతో బ్రతకడమొకటే ముక్తి మార్గాల గొప్ప సూత్రమా
ఆశ చావకా, ఆర్తి తీరకా, కాలాలు కలుపు, వాలారు తలపు
ఉద్వేగంతో ఊగించి లేపి, నిరాకారమై వెలసి ప్రవహించు
విరతి విరమింప భ్రమని కల్పించి, నిరతి పెంపొంద చింత చిందించు  
ఇంకెంతవరకు ఈ వెతుకులాట, ఏ రసాయనం, ఏ ధ్వని సారం
వాయు ప్రవాహం, జ్ఞ్యానం, శాస్త్రం,  వెలువరించేది ఏ పరమార్ధం
వలయ వీచికల తేలియాడుతూ, కలయ తిరుగుతూ, ఎటు ప్రస్థానం