కోరిక తీరక దిగులు
రోజూ పెరిగే మానసిక ఒత్తిళ్ళు
జరిగిన పని సరిగా లేక నిస్పృహ
భయం రోజూ లేవగానే భయం
ఏమైపోతున్దోనని - ఏమైపోతానో అని
పిచ్చికి ఆఖరి హద్దు బాకీ
కామం - ఎటు వైపు గుండె -
మధ్యలో నొప్పి - విసుగు -
పారిపోవడానికి దారి లేదు -
ఎవరది - ఏమిటా చప్పుడు
23 -01 -1999
ఏదో ఒక తపన. లోపల పొంగే ఆలోచనలకి ఒక రూపం కలిగించడానికి. ఇది బాధతో - ఆనందంతో - ఏదో ఒక రసం తో కూడినది కాదు. ఒక నిరామయమైన విశాలత్వం లోంచి పైకి రావడానికి ప్రయత్నించి మాటలో పట్టుపడక కొట్టుమిట్టాడేది. ఎంతో ఆలోచించాక కూడా సిద్ధాంతానికి పట్టుపడని ఒక భ్రమ. ఒక నిర్వికార చేతనావస్థ.
నాకు నేను వేసుకునే ప్రశ్నలకి సమాధానం దొరకని ఒక సత్యం. అనుభవాన్ని ఆసరాగా చేసుకుని ఎదిగిన ఆలోచనకి అందనిది. అంతర్ బహిరింద్రియాలని ప్రభావితం చేస్తూ కూడా అంతు దొరకనిది. ఇది ఏమిటి. నా చేతకాని తనాన్ని అధిగమించడానికి నాలో నేను నా అహాన్ని తృప్తి పరచడానికి చేస్తున్న చర్యా? పైకి మామూలుగా కనిపిస్తూ లోపల గొప్ప మేధస్సుతో అలరారుతున్నానని నన్ను భ్రమింప చేసుకోవడమా? నా నరాల మీద రక్తం తో రాసిన తరతరాల భాష్యమా?తెలియదు. నాకు మటుకు నాకు అన్ని సారాల పరమార్ధం ఇదే. ఒక అలౌకికత్వం .
ఓం శాంతి శాంతి శాంతిః
No comments:
Post a Comment