Monday, October 4, 2010

naa paata kavitvam - 19

Nov92
ఈ రోజు రాత్రి నాకు 
" నేనెంత సామాన్యుణ్ణి"
అని అనుకోవడం ఎంతో తృప్తినిచ్చింది 
నిజం తెలిసిన తరువాత
విరిసే శాంతిలా 
స్తబ్ధమైన వెన్నెల
ఆలోచనలు కాలి
అంతమయ్యే క్షణంలో 
నిట్టూర్పుతో  కలిసిన నవ్వు 
అందమైన కలలు 
కనే ఈ మనసున్నందుకు 
నా అహం చూపే గర్వం
చేయ్యగలిగీ చెయ్యలేని 
నా అసమర్ధత 
చేసినా చిన్నదానిలో కూడా 
నా గొప్పతనం 
చూసుకోగల లౌక్యం
ఎండమావుల వెంటపడి
దొరకలేదనే అసంతృప్తి
నా బ్రతుకులో లేని
రసం లేదు - భావం లేదు 
జన జీవన స్రవంతిలో
కలిసిపోతూ వేరుగా 
నేనున్నాననే భ్రమలో
నా అస్తిత్వం నిలబెట్టుకోవాలనే 
నా తాపత్రయం నాకు
ఈ రాత్రి నవ్వు తెప్పించింది 
నేను లేకపోతె
ఈ ప్రపంచమేది 
భ్రమౌనో కాదో తెలీదు 
ఏది నేను మిధ్యనుకోలేదు 
నేనున్నంతవరకు 
ప్రతీది నిజమే
ప్రతి క్షణం నాకున్న
అంతర్ బహిరింద్రియాల 
సహకారంతో నేను నా గురించి
ఈ అర్ధరాత్రి కనుక్కున్న
గొప్ప సత్యం ఇదే
" నేనెంత సామాన్యుణ్ణి"
అని అనుకోవడం
నాకు నిజంగా సంతృప్తి ఇచ్చింది 

No comments:

Post a Comment