Sunday, April 17, 2011

naa paata kavitvam - 29

1988
చిన్ని చిన్ని పదాలతో ఊహల మాలికలల్లి
ఆ వరసలు చూసి మురిసిపోతూ
ఆలోచనలకు రూపమిచ్చే ప్రయత్నంలో
కలం కదిలించి అలిసిపోతూ
నరాలపై మ్రోగే జంత్ర వాద్యానికి
పల్లవి పాడలేక అవిసిపోతూ
నిశ్శబ్దంలో ఏకాంతంలో......నేను


ఇంకోసారి పాతది reproduce చేద్దామని వ్రాస్తే ఇంకోటి తేలింది
2009
చిన్ని చిన్ని మాటలతో  ఊహల మాలికలల్లి మురిసిపోతూ
అనంతమైన ఆలోచనల ఝరిలో ఎదురీది అలిసిపోతూ
నిశ్శబ్దంలో
ఏకాంతంలో 
నేను


కవన సుధామృత కళా కేళిలో కరిగి పోతూ
నాద పరిచుంబిత అలౌకికానంద లహరిలో తేలిపోతూ
వశం తప్పిన 
పరవశంలో 
నేను


1987
ఎక్కడ ఉన్నా చెలి తలపే
మరిపిస్తోంది నన్ను చెలి వలపే
తట్టాలి చెలి నా వలపు తలుపే
తెలపాలి నాకు తన వలపు తలపే


1988
శీకరమ్ములు    చిందులాడే
జలధరమ్ములు  నింగి  ముసిరి 
హృదయ శ్లథ  శకలముల తోడ
దవిలిన నయనముల నీడన
ప్రరోహ కవన మసృణ చణము 
1988
కరుణ రసాత్మకమైన కావ్యమింకేల
చాలదా చరమ సీమల  శ్లథ జీవనమ్ము 
1988
"నిన్ను నువ్వు తెలుసుకో" కి 
గీటురాయి ఎక్కడ 
చేవుంటే చెప్పు
ఈ చిక్కుని విప్పు
1988
తెరవని కిటికీలకు
దక్షిణ మారుతమైతేనేం
లాభం లేదు లేదు
చెరగని విధి గీతకు 
చీల్చే సౌదామనులేల 
భ్రమే నిజమై తేలే 
ఈ మిథ్యా ప్రపంచంలో
చీకటైతెనేమిటి
చూసే కనులుంటే కదా 
కప్పే సమాదికిక 
నిలబెట్టే పునాదేందుకు
1988
ఋతం
ఏదీ లేదు
ఏదీ కాదు
శాంతి
ద్వందాతీతమైన లయలో
ఈ విపంచి శృతి కలిసే క్షణాన ప్లవించే కాంతి
నా నీడని నేను కౌగిలించుకొనే క్షణం
నాకు నిజమైన శాంతి విశ్రాంతి
౧౯౯౨
ఊపిరందక గిలగిలమని
ప్రాణం నీ కన్నుల 
కొసల కదలాడినా
వెన్నెల అలలు అవలోకించే
ఉన్మత్త ఊహా మరుత్తువి......

తకిట తకిట తక  ధింతానా    
నిజాల నించి
ఇజాల నించి
పారిపోలేవు రామారావ్


ముసుగులు వేసీ
తలుపులు మూస్తే
నిజం దాగునా రామారావ్


ధీరుడవోయ్
శూరుడవోయ్
ఉక్కు కత్తుల రామారావ్


చీకటి శ్లేషల
శ్లేష చీకటుల
వేకువ నీదోయ్ రామారావ్


ఆకలి వేస్తె
మొక్కలు పాతే
గొప్ప తెలివిగల రామారావ్


భావుకత నీకు
ఆరో ప్రాణం
అసలైదేక్కడ రామారావ్


అన్నీ తెలుసనీ
ఏమీ తెలియని
తెలిసీ తెలియని
ఫిలాసఫీ తో
పొడి పొడి కత్తులు
విడుపనిషత్తులు
భగవత్గీతలు
తిలక్, చెలాలు
వీరేన్, శ్రీశ్రీ
వీడా వాడా
ఎవడని  చెప్పను
అందరినీ
ఔపోసన పట్టి
బ్రతుకంతా
ఒక చాపన చుట్టి
చంకన పెట్టి
ఎడారి ఇసుకలో
బిడారి గుంపుతో
ఒయసిస్సుకై
చూస్తున్నావా రామారావ్
ఇంతేనా ఇది
ఎలా సాగేది
కటి చీకటిలో రామారావ్
శూన్య నిశీధిలో రామారావ్


హైకూ to అమ్మలు 
ఛోళే  పూరి
మిరపకాయ బజ్జి
ఫ్రైడ్ రైస్
చెనా బథురా


డాల్ఫిన్ హోటల్
ఫస్ట్ షో సినిమా
బైక్ షికారు
మహా హుషారు


పంతాలు సగం
కొండంత అహం 
ఒంట్లో నీరసం
అయినా ఆగం

ఒక్కొక్క సారే
ఏదైనా సరే
అంతం లేనిది
ఈ "ఒక్కసారే"

ఒళ్ళే వంచం
వంచనే వంచం
తిండీ, మంచం
ఇదీ ప్రపంచం

చేత రిమోటు
ఇస్తే ఒట్టు 
అది అడిగావా
నీ గతి డౌటు

అమాయకత్వం 
అతి ఆవేశం
ఏది తెలియని
అతి మూర్ఖత్వం

అర కప్పు స్వార్ధం
ఒక కప్పు బద్ధకం
కలియ తిప్పితే
ఈ అవతారం

చెబితే కోపం
అంటే నేరం
చెప్పకపోతే
గొప్ప అనుమానం


1991
ఆగమని తెలిసినా ఆగని కథ
జ్ఞ్యాన సముపార్జనమొక తీరని వ్యధ 

2010 (ద్విపద)
చెర వీడి చెర చెర చెరలాడు చెలులు 
వలరాజు వలిగొను వలవంత కలలు
(ఇది వ్రాసినందుకు రాంబాబు నాకు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు)

2 comments:

  1. Dear sir
    Anonymity is a virtue. Once two people approach to learn or understand each other the previous impressions slowly fizzle out and out come may be soft or bizarre.Let us both for a time period be on this blog and i dont want to disturb a good going between us which opened quite a deal of doors to me.

    ReplyDelete
  2. dear mohan
    if it is so - then let it be - whatever you feel like correct - still i remember there is a big mail waiting for me - any time you feel like flowing

    ReplyDelete