ఇంతకు ముందు post లో నేను, మనం పూజలలో చదివే మంత్ర పుష్పంలో మనిషి గురించి, ఈ విశ్వం గురించి చెప్పడం జరిగింది అన్నాను. దశావతారాలు గురించి వ్రాసే ముందే మంత్రపుష్పం యొక్క టీకా, తాత్పర్యాలు type చెయ్యడం complete చేశాను. దానితో మంత్రపుష్పం గురించే ముందు post చేస్తున్నాను. దీని తరువాత post లో ఈ మంత్రపుష్పాన్ని latest scientific discoveries తో correlate చేస్తే మనము ఇప్పుడు అర్ధం చేసుకుంటున్న ప్రపంచం ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంతే clarity తో చెప్పబడిందని అవగతమౌతుంది. మనకి మన పుణ్య భూమి ఔన్నత్యం అర్ధం అవుతుంది అనిపించి ఈ ప్రయత్నం.చిన్న చిన్న typing mistakes ని మన్నించగలరు. ఇది నేను బొమ్మకంటి సుబ్రమణ్య శాస్త్రి గారు వ్రాసిన పుస్తకం చదివి అర్ధం చేసుకున్నాను. ఈ post కి internet మొత్తం గాలించి ఆ భావానికి తగ్గట్టుగా photos వెతికిపెడుతున్న నా friend rk కి కృతజ్ఞ్యతలు.
మంత్ర పుష్పం , నారాయణ సూక్తం
1.ఓం
ధాతా పురస్తా ద్యముదాజహార
శక్రః
ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్త్రః
తమేవమ్
విద్వా నమృత ఇహ భవతి
నాన్యః
పంథా ఆయనాయ విద్యతే
టీకా: ధాతా = ప్రజాపతి, పురస్తాద్యమ్ - పురతః+ఆద్యమ్ = ఓం ప్రధమముగా,
ముదాజహార= స్తోత్రించి సుఖించేనో, శక్రః= ఇంద్రుడు, ప్రవిద్వాన్= ప్రకటించి తెలియజేసేను, ప్రదిశః=
అన్నీ దిక్కుల ప్రజలకును, చతస్రః = సర్వ రక్షాకునిగా, తమ్= అట్టి వానిని, ఏవం=మాత్రమే, విద్వాన్ =తెలిసికొనుట చేత, అమృత= మరణము లేనిదిగా, ఇహ= ఈ సమస్తము, భవతి= అగును,
న+అన్యః- న= లేదు, అన్యః= ఇతరమగు,
పంథా= విధానము, ఆయనాయ= ఈ సందర్భమున,
విద్యతే= తెలియజేయబడుచున్నది.
తా: ఓం ప్రధమముగా ప్రజాపతియగు బ్రహ్మ ఎవరిని స్తుతించుటచే సుఖ మార్గము,
ఆయనను స్తోత్రించుటేయని తెలిపేనో, త్రిజగత్పాలాకుడైన
ఇంద్రుడు తాను నిమిత్తమాత్రుడనని ఎరిగి సర్వ దిక్కుల యందలి ప్రజలకు ఎవనిని
సంరక్షకునిగా తెలుసుకొని ప్రకటించేనో, ఆయనను( ఆ
విరాట్పురుషుని) తెలుసుకొనుట చేత మాత్రమే –మృత్యుస్థలియగు ఇహమాంతయు అమృతత్వము
పొందుచున్నది. అమృతత్వము నందుటకు గాను ఈ సందర్భమున -“ఆయనను తెలియుట” –వినా మరియొక మార్గము లేనే
లేదని తెలియబడెను.
2. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం
టీకా: సహస్ర= అనేకమైన,
శీర్షం =శిరస్సులు కలవాడును, దేవం = దివ్యుడును, విశ్వ+అక్షం= అనేకమైన నేత్రములు కలవాడును, విశ్వ
శంభువం = విశ్వము కొరకు శుభములను కలిగించువాడును, విశ్వం =
అఖిలా జగత్తును తానే అయినవాడును, నారాయణం = జగత్కారణ భూతమున
వసించువాడును, దేవం = మంగళాకారుడు లేదా పరమాత్మ, అక్షరం = నాశనము లేనివాడును, పరమం = మోక్షమునకు
పదమ్ =స్థానమును(అయి ఉన్నాడు)
తా: అనేక శిరస్సులను, అనతమైన నేత్రములను కలిగి, ఈ సమస్త విశ్వమునకు శుభములను సమకూర్చుచూ, జగత్తు
సమస్తము తన రూపమే అయినవాడును, జగత్కారణ భూతమునకు ఆద్యుడునూ, మంగళాకారుడగు పరమాత్మ – నాశము లేనివాడునూ, మోక్ష
పథమునకు ఆధారభూతుడునూ అయి ఉన్నాడు.
3.విశ్వతః పరమాన్నిత్యమ్ విశ్వం నారాయణగ్o హరిమ్
విశ్వమే వేదం పురుషస్త ద్విశ్వ ముపజీవతి
టీకా: విశ్వతః= ఇహము కంటెను, పరమాన్ = ఉత్కృష్టమైనవాడును, నిత్యం = శాశ్వతుడును, విశ్వం = సర్వాత్మకుడును, నారాయణగ్o =నారాయణుడును, హరిం
=పాపములను హరింపచేయువాడును, పురుషః =పరమాత్ముడే, ఏ= ఈ, విశ్వం = లోకమును, వేదం
=ప్రకటించేను,తత్ =ఆ పురుషునే, విశ్వం
=సమస్తమును ఉపజీవతి =ఆశ్రయించి ఉన్నది.
తా: ఇహము కంటెను ఉత్కృష్టుడును, శాశ్వతుడును,
సర్వాత్మకుడును, నారాయణుడును, పాపములను
హరిపచేయువాడును అయిన పురుషుడే ఈ లోకములను ప్రకటించేను. లోకములా పురుషునే పరమాత్మునిగా
తెలుసుకొనినవి. ఆయనను ఆశ్రయించియే ఈ సమస్తమును జీవించుచున్నది.
4.పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o శాశ్వతగ్o
శివమచ్యుతమ్
నారాయణం మహాజ్ఞ్యేయమ్ విశ్వాత్మానం పరాయణం
టీకా: పతిం= భర్తయు, విశ్వస్య = ప్రపంచము యొక్క, ఆత్మ+ఈశ్వరగ్o =జీవకోటికి అధినాయకుడును, శాశ్వతగ్o = నిత్యము ఉండువాడును, శివం =మంగళప్రదుడును, అచ్యుతమ్ =తన ఉన్నతి నుండి ఏ
మాత్రము దిగజారని వాడును, నారాయణ =నారాయణుడు ఒక్కడే, మహా జ్ఞేయమ్ –తెలిసికొనవలిసిన విషయములన్నిటియందు ప్రౌఢుడు, ప్రధముడు, ఉత్కృష్టమైనవాడును,
విశ్వాత్మానం = ఈ సమస్తమునకు ఆత్మ అయిన వాడును, పరాయణం =
ఆధారపడ తగినవాడు(అయి ఉన్నాడు)
తా: పరిపాలకుడును, ఈ సమస్త జీవ కోటికి ప్రాణప్రియుడును, నిత్యమును యుండువాడును, మంగళప్రదుడును, తన ఔన్నత్యము నుండి ఏ మాత్రము దిగజారని వాడును అయిన నారాయణుడు ఒక్కడే, తెలుసుకొనవలసిన ఉత్కృష్ట విషయమును(వేదాంతమును)తెలిసినవాడు, సృష్టి సమస్తమును ఆధారపడదగినవానికి ప్రణమిల్లెదను.
5. నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణః పరః
నారాయణ పరమ్ బ్రహ్మ తత్వం నారాయణః పరః
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
టీకా: నారాయణః = ఆ శ్రీ మన్నారాయణుడే,
పరః =ఇహాతీతమైన, జ్యోతిః =కాంతులను విరజిమ్ము జ్యోతి, ఆత్మా =ఆత్మస్వరూపమును, పరః =ఉత్కృష్టత, నారాయణః =నారాయణుడే, పరంబ్రహ్మ =సమస్తము యొక్క మూలాధార విషయక చింతనము, పరోధ్యాతా =పరునిగా ధ్యానిoపబడువాడు
తా: నారాయణుడే పరంజ్యోతియై ఉన్నాడు. తత్పరాయణమగు ఆత్మయు,
పరమాత్మయు నారాయణుడే అయి ఉన్నాడు. తాను గుణ రహితుడయ్యును,
త్రిగుణగణగ్రామముగా జగత్తును సృజించి
-ఈ సర్వమునకు మూలాధారమగు కర్తృత్వము వహించిన పరబ్రహ్మము నారాయణుడే అయి
ఉన్నాడు. ఈ బ్రహ్మమును తెలియుటకు ఆశ్రయింపబడు తత్వములలో ఉత్కృష్టమైన పర తత్వము
తనేయై ఉన్నాడు. నారాయణుడే ధ్యానము చేయబడు ఉత్కృష్టుడగు పరముడై ఉన్నాడు. ఆ
నారాయణుడే ధ్యానమునూ అయి ఉన్నాడు. ధ్యానం –ధ్యాతా –ధ్యేయం –సర్వమూ తానే అయి ఉన్న ఆ
నారాయణునకు నమస్కారము.
6. యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే౭ పివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః
టీకా: దృశ్యతే=కనపడు నట్టిది, శ్రూయతే =వినబడుచున్నట్టిది, అపివా=కూడా అయినటువంటి, అకించత్ = అనల్పమైన, జగత్= నిత్యమూ మారుచుండేది లక్షణము గల ప్రపంచము,
సర్వం = సమస్తమైన, యత్ చ
=ఎదైతే ఉన్నదో, తత్= ఆ యొక్క,
సర్వం= సర్వ సృష్టియునూ, అంతర్= లోపాలను, బహిః+చ= వెలుపల కూడా, నారాయణః= ఆ నారాయణుడే(పరమాత్మయే), వ్యాప్య= వ్యాపించినటువంటివాడై , స్థితః =
ఉన్నాడు(న్నది)
తా: కంటికి కనబడునటువంటిదినీ, కనబడకున్ననూ ఇతరుల ద్వారా చెప్పబడుటచే మనకు
వినబడుచున్నదినీ అయిన అఖండమైన ఏ సువిశాలమైన జగత్తు ఉన్నదో, ఆ
సమస్తమైన జగత్తుకూ, బాహ్యాభ్యంతరములు అనగా – లోపలా, వెలుపలా కూడా ఆ నారాయణమయమై ఉన్నది.
7. అనంతమవ్యయం కవిగ్o సముద్ద్రే౭ న్తమ్ విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగ్o హృదయం చాప్యధోముఖం
టీకా: అనంతం = అంతం లేనివాడునూ, అవ్యయం =వ్యయము కానివాడునూ అనగా నాశనము
లేనివాడునూ, కవిగ్o = సర్వజ్ఞ్యుడు, సముద్రే+అంతం = సంసార సముద్రమునకు చివరినుండువాడునూ,
విశ్వ శంభువం = సమస్త జగత్తుకు సుఖదాయియును, హృదయం=జీవకోటికి హృదయం అనునది, పద్మకోశ = తామరమొగ్గవలే, ప్రతీకాశగ్o =ప్రకాశవంతమై, అధోముఖం
చ =అధోముఖముగా అంటే కాడ పైకీ పూవు దిగువకూ ఉన్నట్టుగా ఉన్నది.
తా: పరమాత్మ –అంతము లేనివాడునూ, వ్యయము కానీ వాడునూ,
కులమత జాతి, లింగ, దేశ, కాల విభేదం లేశం అంతయూ లేనివాడునూ, సర్వజ్ఞ్యూడునూ, భావుకుడునూ, కల్పనా సమర్ధుడునూ, స్రష్ట యును, ఈ సంసార సముద్రమును అంతము చేయువాడునూ, సమస్త జగత్తుకూ సుఖప్రదాతయై ఉన్నాడు. “పూర్వ శ్లోకమున ఆయన, లోపల, బయట ఉన్నాడనినారు కదా,
వెలుపలయనగా విశ్వమంతటా అని అర్ధం. జీవకోటియందు ఏ జీవికి ఆ జీవికే వ్యష్టిగా హృదయము
అనునది ఒకటి ఉండును. అది ఎట్లుండును అనగా – తలక్రిందులైన తామరమొగ్గవలే బంగారు
వెలుగులు విరజిమ్ముచూ ఉండును.
8. అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యా ముపరి తిష్ఠతి
జ్వాలామాలాకులం భాతి విశ్వాస్యా౭యతనం మహత్
టీకా: అధో = దిగువగా, నిష్ఠ్యా =మెడకు లేదా కంఠమునకు, వితస్త్యాంతే = వితస్తి+అంతే =జానెడు దూరమున,
నాభ్యాం =బొడ్డునకు, ఉపరి =పై భాగమునందు, తిష్ఠతి =ఉండును, జ్వాలామాలా = మాలికావలెనున్న అగ్నుల, కులం= తెగ, భాతి =వలె,
విశ్వస్వ= సమస్త సృష్టి యొక్క, ఆయతనం =స్థానము, మహత్= పురుషత అయి ఉన్నది
తా: ఈ అనువాకమందు దేహామందు ఆ హృదయము యొక్క తావును ధృవీకరించుచున్నారు.
కంఠమునకు దిగువ, బొడ్డునకు జానెడు పైన హృదయము ఉండును.
9. సంతతగ్o శిలాభిస్తు లమ్బత్యా కోశ సన్నిభమ్
తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్
టీకా: సంతతగ్o = నిత్యమును, శిలాభిస్తు
= నాదులచే, లమ్బత్యా
= లంబాకృతిని వ్రేలాడు, కోశ = కుంజము యొక్క ,
సన్నిభమ్ =సమానముగా ఉండు, తస్యాంతే = ఆ హృదయమునకు నడుమ, సుషిరగ్o
=రంధ్రము, సూక్ష్మం =అతి స్వల్పమైనది కలదు, తస్మిన్ =దానియందే, సర్వం =సంస్తమూనూ, ప్రతిష్ఠితమ్ = ఉంది ఉన్నది.
తా: హృదయము యొక్క ఆకారము, స్థానము పైన తెలుపబడినవి. ఇప్పుడు ఈ
అనువాకమందు దాని గుణము, గొప్పతనమునకు కారణము
తెలుపబడుచున్నది. జ్వల జ్వలాయమానమైన అనేక నాడీ సమూహంతో నుండు ఆ హృదయ కమలం మీదే అతి
సూక్ష్మమైన రంధ్రమొకటి కలదు. ఈ సర్వస్వమును ఆ రంధ్రమునందే ప్రతిష్ఠితమై ఉన్నది.
10. తస్యమధ్యే మహానగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః
సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్ధ్వ మధశ్శాయీ రశ్మయస్తన్య సన్తతా
టీకా: తస్య = ఆ రంధ్రమునకు,
మధ్యే = నడిమి భాగమునందు, మహానగ్ని =దట్టమైన, ప్రౌఢమైన,
మహత్వ పూర్వకమైన అగ్ని, విశ్వార్చిహ్ =అనంతమైన జ్వాలలతో, విశ్వతో ముఖః =విశ్వమునకు అభిముఖమై
ప్రకాశించును. సో ౭ గ్రభుక్ – సః+అగ్రభుక్
- సః =ఆ అగ్ని అగ్రభుక్ =(తనకు)ముందున్న ఆహారమును భుజించునది, విభజంతిష్ఠ న్నాహారం - విభజన్+తిష్ఠన్+ఆహారం - విభజన్ = విభజించుచూ,
తిష్ఠన్ = ఉండును,ఆహారం =ఆహారమును,
తిర్యక్ =అన్నీ దిక్కులకీ ఊర్ద్వమ్ =ఎగువకూ, అధః =దిగువకూ, శాయీ = పరచబడిన, రశ్మయః = వెలుగులు, తస్య = ఆ అగ్ని యొక్క, సన్తతా =సంతానములై ఉన్నవి.
తా: ఆ హృదయ మధ్యమున అత్యంతము చిన్నదియగు ఒక రంధ్రము కలదు. ఈ సర్వమును ఆ
రంధ్రమునందే కలదు. ఆ రంధ్రమునకు మధ్య
భాగమందు సర్వే సర్వత్రా వెలుగులను విరజిమ్ము అనంతములగు జ్వాలలతో కూడిన మహత్వా
పూర్ణమగు అగ్ని ఉన్నది. ఆ అగ్ని తన ఎదుట ఉన్న ఆహార పదార్ధములను భుజించును. ఇతరములను
విభజించుచూ ఉండును. ఆ అగ్ని నుండి ప్రభవించు –వెలుగు కిరణములు –పైకిని,
క్రిందకును, అడ్డము మరియూ ఏటవాలులుగాను సర్వత్రా
ప్రసరింపబడుచుండును. తన ఉపాసకులకు తన వంటి తేజమునిచ్చి ముసలితనము లేని స్థితిని –సర్వజ్ఞ్యతను
అనుగ్రహించును.
11. సంతాపయతి స్వం దేహ మాపాద తల మస్తకః
తస్య మధ్యే వహ్ని శిఖా అణీ యోర్ధ్వా వ్యవస్థితః
టీకా: సంతాపయతి =కాల్చి వేయుచుండును,
స్వం = తన యొక్క, దేహo =స్సరీరమును, ఆపాద తల మస్తకః = అరికాళ్ళ నుండి బ్రహ్మ రంద్రము వరకును, తస్య మధ్యే వహ్ని శిఖా =ఆ మహానగ్ని యొక్క అగ్ని చారికల నడుమ, అణీ యోర్ధ్వా =వాటి నడుమ ఇరుసువలే ఎగువలకు, వ్యవస్థితః
=వెలుగుచూ ఉండును.
తా: వైశ్వానరమనబడు ఆ మహానగ్ని తన నుండి
సర్వత్రా వ్యాపించే అగ్ని కణముల వేడిమి చేత, తాను ధరించిన
దేహమును అరికాళ్ళ నుండి బ్రహ్మ రంధ్రము వరకును తపింపచేయుచుండును. అట్టి మహా
తాపకమైన రశ్ములు కలిగిన అగ్నుల నడుమ –ఆ అగ్ని చక్రమునకు ఇరుసు కొనయో అన్నట్లు ఒక
విశిష్టాగ్ని ఊర్ద్వముఖమై వెలుగు చున్నది.
12. నీలతో యద మధ్యస్థా ద్విద్యుల్లేఖే వ భాస్వరా
నీవార సూక వత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
టీకా: నీల = నీలి రంగు , తోయద =మేఘము యొక్క, మధ్యస్థాత్
=మధ్యభాగములో ఉండునటువంటి , విద్యుల్లేఖేవ =మెరుపు తీగ వలె, భాస్వరా = ప్రకాశించుచున్నది,నీవారసూకవత్ +తన్వీ
=నివ్వరి ధాన్యపు గింజ యొక్క పై ములుకంత రూపున, పీతా =బంగారు, భాస్వత్
=వెలుగుతో, అణూపమా –అణు+ఉపమా =సూక్ష్మ తారమైన దానికి
ప్రతీకగా ఉన్నది.
తా:ఆ అగ్ని చార, నీలి మబ్బు నడుమ మెరుపు తీగవలే, సూక్ష్మ తమమైన నివ్వరి ధాన్యపు గింజ యొక్క పై ములుకంత ప్రమాణమున బంగారు
కాంతులు విరజిమ్ముతూ ప్రకాశించుచున్నది.
13. తస్యా శ్సిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః
స బ్రహ్మ సశివ స్సహరి స్సేన్ద్ర స్సో౭క్షరః పరమస్స్వరాట్
టీకా: తస్యాః =దానియొక్క , శిఖాయ =అగ్రభాగపు, మధ్యే =నడుమ, పరమాత్మా =భగవంతుడు, వ్యవస్థితః = వ్యవస్థితుడై
ఉన్నాడు. సః =అతడే, బ్రహ్మః =సృష్టికర్త, సః =అతడే, శివః =లయకారుడగు శంకరుడు, సః =అతడే,
హరిః = స్థితికరుడగు విష్ణువు, . సః =అతడే, ఇన్ద్రః
=త్రిజగత్పాలకుడు, సః =అతడే, అక్షరః
=నాశనము లేనివాడు, పరమః =పరాముడు, స్వరాట్
=స్వయం రాజా.
తా: ఆ సూక్ష్మాగ్ని యొక్క అగ్ర భాగపు నడుమే పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు.
అతడే సృష్టి కర్తయగు బ్రహ్మ, అతడే లయకారుడగు శివుడు, అతడే స్థితికరుడైన విష్ణువు, అతడే జగత్పాలకుడు
ఇంద్రుడు, అతడే నాశనము లేని శాశ్వతుడు. అతడే శుద్ధ చిదానంద
రూపుడైన పరముడు. అతనే స్వయంరాజా.
ఇతి శ్రీ కృష్ణ యజుర్వేదీయ, తైత్తరీయ అరణ్యక దశమ పాఠకే నారాయణోపనిషది
త్రయోదశోనువాకః
14. యో ౭ పాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్
పశుమాన్ భవతి
చన్ద్రమావా అపాం పుష్పం,
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవంవేద
టీకా: యః = ఎవడైతే, అపాం =జలమును,
పుష్పం=పుష్పముగా, వేద=తెలుసుకొనుచున్నాడో,(వాడు) పుష్పవాన్=స్త్రీ లను కలిగినవాడును,
ప్రజావాన్=సంతానము కలవాడును, పశుమాన్=పశు గుణ సంపత్తు
కలవాడును, భవతి=అగును. యః = ఎవడైతే,
చంద్రమావా=అమృత మండలాకారుడగు చంద్రుడే, అపాం పుష్పం= జల
పుష్పం, ఏవ= అని ఈ విధముగా,
వేద=తెలుసుకొనుచున్నాడో, ,(వాడు) పుష్పవాన్=స్త్రీ లను
కలిగినవాడును, ప్రజావాన్=సంతానము కలవాడును, పశుమాన్=పశు గణ సంపత్తు కలవాడును, భవతి=అగును.
తా: ఎవడైతే జలమును పుష్పముగా తెలుసుకొనుచున్నాడో,
ఎవడైతే అమృత మండలాకారుడగు చంద్రుడే ఆ జలపుష్పం అని తెలుసుకొనుచున్నాడో వాడు స్త్రీ
లను కలిగినవాడును, సంతానము కలవాడును,
పశు గణ సంపత్తు కలవాడునుఅగును.
15. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అగ్నిర్వా అపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
యో ౭ గ్నే రాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవా ఆగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: యః = ఎవడైతే, అపాం =జలముల, ఆయతనం =
స్థానమును, వేద=తెలుసుకొనుచున్నాడో,(వాడు)
ఆయతనవాన్ =అట్టి స్థానము కలవాడు, భవతి =అగును. (అట్లే) యః = ఎవడైతే, అగ్నిర్వా =అగ్నియే, అపాం =ఉదకములకు, ఆయతనం వేద = స్థానమును తెలుసుకొనుచున్నాడో,(వాడు)
ఆయతనవాన్ భవతి =అట్టి ఉత్కృష్ట స్థానము కలవాడుగా అగును. యః = ఎవడైతే, అగ్నేః =అగ్ని యొక్క, ఆయతనం వేద = స్థానమును
తెలుసుకొనుచున్నాడో,(వాడు), అపోవా
=జలములే, అగ్నేః =అగ్ని యొక్క, ఆయతనం
=స్థానము, ఏవం =అని, వేద = తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =అట్టి ఉత్కృష్ట స్థానము కలవాడుగా అగును.
తా: ఎవడైతే జలముల స్థానము తెలుసుకొనగలుగుచున్నాడో వాడు అట్టి స్థానము కలవాడుగా
అగును. ఎవడైతే అగ్నిని జలములకు ఆధార భూతముగా గుర్తిస్తున్నాడో,
వాడు అగ్ని స్థానీయుడగును. అట్లే, ఎవడైతే అగ్నికి జలములే
ఆధారభూతమని ఎరుగుచున్నాడో వాడు అంతటి స్థానము కలవాడుగా అగుచున్నాడు. నీటికి
నిప్పును, అగ్నికి-జలములును పరస్పర ఆధారభూతములని తెలిసి
కొనిన వాడే ఎరుకగలవాడు అగును.
16. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
వాయుర్వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యోవాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
అపోవై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: యః = ఎవడైతే, అపాం =జలముల, ఆయతనం =
స్థానమును, వేద=తెలుసుకొనుచున్నాడో,(వాడు)
ఆయతనవాన్ =అట్టి స్థానము కలవాడు, భవతి =అగును. (అట్లే) యః = ఎవడైతే, వాయుర్వా =గాలియే అపాం= ఉదకములకు, , ఆయతనం వేద = మూల స్థానముగా తెలుసుకొనుచున్నాడో,(వాడు)
ఆయతనవాన్ భవతి =అట్టి ఉత్కృష్ట స్థానము కలవాడుగా అగును. యో =ఎవడైతే, వాయుః =గాలి యొక్క, ఆయతనం వేద =స్థానము తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =ఆ
స్థానము కలవాడుగా అగును.
యః = ఎవడైతే, అపోవై =ఉదకములే, వాయుః =గాలి
యొక్క ఆయతనం =ఆధారభూతము, ఏవ =అని, వేద = తెలుసుకొనుచున్నాడో,(వాడు) ఆయతనవాన్ భవతి =అట్టి తావును కలవాడుగా అగును.
తా: ఎవడు ఉదక స్థానమును ఎరుగునో,
వాడు ఉన్నత స్థానము పొందును. నీటి యొక్క మూలస్థానము వాయువుగా ఎరిగినవాడును, వాయువునకు జలములే ఆధారభూతముగా గుర్తించినవాడును –అవి రెండును పరస్పర
ఆధారభూతములుగా తెలిసినవాడు, అట్టి ఉత్కృష్ట పథమును
అందుకొనును.
17. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అసౌవై తపన్నపామాయతనం, ఆయతనవాన్ భవతి
ఆముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవా ఆముష్య తపత ఆయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: అసౌవై =ఈ జ్వలించుచున్న తపనః =సూర్యుడే, ఆముష్యతపత =ఈ
ప్రకాశ మానుడైన సూర్యుని యొక్క
తా: జలముల స్థానమునేరిగినవాడే స్థానము కలవాడగును. ప్రకాశించు సూర్యుడే
ఉదకములకు ఆధారభూతుడని తెలిసినవాడే మూలకందము నొందజాలును. జ్వలించునటువంటి ఆ
భాస్కరునకు సలిలములే ఆధారమని ఎరిగినవాడు ఎరుకగలవాడు అగును. సూర్యునకు,
సలిలములకూ గల పరస్పర సంబంధమెరిగినవాడే ముక్తుడగును.
18. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
చన్ద్రమా వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యశ్చన్ద్ర మస ఆయతనం వేద,
ఆయతనవాన్ భవతి
అపోవై చన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: చంద్రమావా =చంద్రుడే, చంద్రమస =చంద్రుని యొక్క
తా: సలిలముల యొక్క మూలమునేరిగినవాడు స్థానము కలవాడు అగును. చంద్రుడే జలములకు
మూలస్థానముగా తెలుసుకొనిన వాడు స్థానవంతుడగును. అట్లే జలములే చంద్రునకు
మూలస్థానముగా గ్రహించినవాడు స్థానము పొందువాడు అగును. ఎవరైతే చంద్రునకు సలిలములు,
, సలిలములకు చంద్రుడు పరస్పర స్థానములుగా తెలుసుకొనగలుగుదురో
వారు అక్షయ పదము కలవారు అగుదురు.
19. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
నక్షత్రాణివా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యో నక్షత్రాణా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవై నక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: నక్షత్రాణివా =నక్షత్రములనే, నక్షత్రాణాం =నక్షత్రముల యొక్క
తా: ఉదకముల ఉనికిపట్టు నెరిగినవాడే ఉనికి గలవాడు అగును. ఎవరైతే నక్షత్రములకు
సలిలములు, సలిలములకు నక్షత్రములు పరస్పర స్థానములుగా తెలుసుకొనగలుగుదురో
వారు ఆయతనవంతులు అగుదురు.
20. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యః పర్జన్యస్యాయతనం, ఆయతనవాన్ భవతి
అపోవై పర్జన్యస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: ప్రజాన్యోవా =మేఘములే, పర్జన్యస్య =మేఘము యొక్క
తా: సలిలముల యొక్క మూలమునేరిగినవాడు స్థానము కలవాడు అగును. మేఘమే నీటికి
మూలాధారముగా కనుగొనిన వాడు ఆధారము కలవాడు అగును. అట్లే ఎవడు మేఘమునకు
జన్మస్థానమెరుగునో వాడు సృష్టి స్థానము కలవాడు అగును. నీళ్లే మేఘములకు మూలకందము
అని ఇట్లేవడు తెలియపరచబడుచున్నదో వాడు మూల కందమును అందుకొన గలవాడు అగును.
21. యో౭పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
సంవత్సరో వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి
యస్సంవత్సరస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అపోవై సంవత్సరస్యాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవంవేద
టీకా: సంవత్సరోవా =సంవత్సరమే సంవత్సరశ్య=సంవత్సరమే
తా: : సలిలముల యొక్క మూలమునేరిగినవాడు స్థానము కలవాడు అగును. సంవత్సరమే నీటికి
మూలాధారముగా కనుగొనిన వాడు ఆధారము కలవాడు అగును. అట్లే ఎవడు సంవత్సరమునకు జన్మస్థానమెరుగునో వాడు స్థానవంతుడు అగును.
నీళ్లే సంవత్సరమునకు మూలకందము అని
ఇట్లెవడు తెలియపరచబడుచున్నాడో వాడు మూల కందమును అందుకొన గలవాడు అగును.
22. యో౭ప్సునావం ప్రతిష్ఠితాం వేద, ప్రత్యేవ తిష్ఠతి
టీకా: యః =ఎవడు, అప్సు =నీటియందు,
నావం =ఓడను, ప్రతిష్ఠితాం =సుస్థిరమైన దానిగా, వేద =తెలుసుకొనునో, ప్రత్యేవ తిష్ఠతి =ప్రతిష్టితుడగును
తా: జలములందు సుస్థిరముగా ఉన్న ఓడను, ఓడను పరివేష్ఠించిన జలములను
అన్యోన్యాశ్రయములుగా ఎరిగినవాడు ముక్తుడగును.
23. కిం తద్విష్ణోర్బల మాహుః, కా దీప్తిః కిం పరాయణం
ఏకొ యధ్ధారాయ ద్దేవః రేజతీ రోదసీ ఉభౌ
టీకా: కిం =ఎట్టి తత్ =ఆ యొక్క విష్ణోర్బల =విష్ణువు యొక్క బలము,ఆహుః=అయి
ఉన్నది? కా =ఏది, దీప్తిః =ప్రకాశమును, కిం =ఎట్టి, పరాయణం =కారణము(వలన), ఏకో= ఒక్కడయ్యును, యత్= ఎవరు,
ధారయత్ = ధరించుచున్నాడు, రేజతీ =భూమినీ, రోదసీ = ఆకాశమును, ఉభౌ= రెండింటినీ.
తా:ఏ దైవము తాను ఒక్కడే అయ్యును, ఇహ పరములగు భూమ్యాకాశములు రెండింటినీ
ధరించుచున్నదో, ఆ దైవమగు, విష్ణువుకు
అంతటి బలమెట్లు కలిగెను? ఏ తేజము వలన సాధ్యము? అందుకు కారణమేమి?
24. వాతాద్విష్ణోర్బల మాహుః అక్షరాదీప్తిః రుచ్యతే
త్రిపధా ద్దారయః ద్దేవః యద్విష్ణో రేక ముత్తమమ్
టీకా: వాతాత్ =వాయువు వలన, విష్ణోః =విష్ణువు యొక్క, బలం =శక్తి, ఆహుః =కలిగినది,
అక్షరాత్ =నాశనము లేకుండుట వలన, దీప్తి =ప్రకాశమును, ఉచ్యతే =చెప్పబడుచున్నది. యత్ =ఏ యొక్క, దేవః
=దైవము, త్రిపదాత్ =త్రిపాద్విభూతి చేత, ధారయత్ =(ఇహపరములు రెండిటినీ) ధరించు చున్నదో, తత్
=ఆ, విష్ణో =విష్ణువు, ఏకః =ఒక్కడే, ఉత్తమమ్ =శ్రేష్టుడై ఉన్నాడు.
తా: విష్ణువుకు వాయువు వలన బలము, శాశ్వతత్వము వలన తేజము కలుగు చున్నవి.
త్రిపాద్విభూతి చేతనే ఈ ఇహపరములను ఉభయము ధరించిన దైవమెవరై ఉన్నారో –ఆ విష్ణువు
ఒక్కడే సర్వ శ్రేష్టుడు.
25. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవై యం వై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామకామాయ మహ్యం, కామేశ్వరో వై శ్రావణౌ దధాతు
కుబేరాయవై శ్రవణాయ, మహారాజాయ నమః
టీకా: రాజాధిరాజాయ =రాజులేల్లరకు
రాజైన వానికి, ప్రసహ్య =పరుల లాభములను, సాహినే
=ఈడ్చువానికి, నమో =నమస్కారము, వయం =మేము,
వైశ్రవణాయ =వైశ్రవణునకు కుర్మహే
=చేయుచున్నాము, స =అతడు, మే =నా యొక్క, కామాన్ =కోరికలు, కామ =కోరబడినట్టివి, కామాయ=(అన్నీ) కోరికలను, మహ్యం =నా కొరకు ,
కామేశ్వరో =సర్వ కోరికలకు యజమానుడగు, వై శ్రావణౌ =వైశ్రవణుడు
దధాతు =ఇచ్చుగాక,కుబేరాయ
=అట్టి కుబేరునకు, వైశ్రవణాయ =వైశ్రవణునకు , మహారాజాయ =దొడ్డ రాజునకు, నమః =నమస్కారము.
తా: రాజులేల్లరకు రాజైన వానికి , పరుల లాభములను ఈడ్చువానికి, వైశ్రవణునకు మేము నమస్కారము చేయుచున్నాము. సర్వ కోరికలకు యజమానుడగు
వైశ్రవణుడు నా యొక్క కోరికలు సమస్త వాంఛలూ నెరవేర్చుగాక. అట్టి కుబేరునకు, వైశ్రవణునకు, దొడ్డ రాజునకు నమస్కారము.
26. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం
తదాత్మా
ఓం తత్సత్యమ్, ఓం తత్సర్వం , ఓం
తత్పురోమ్ నమః
టీకా: ఓం = ప్రణవ రూపమైన,
తత్ =అదియే, బ్రహ్మ =నిత్య వృద్ధి పరిణామశీలకమగు బ్రహ్మము, ఓం తద్వాయు =అదియే సర్వ వ్యాపకమైన వాయువు, ఓం
తదాత్మా =అదియే ప్రాణము, జీవుడు, పరమాత్మ,ఓం తత్సత్యమ్
=అదియే యదార్ధము, ఓం తత్సర్వం =అదియే సర్వము చరాచర జగత్తు
సమస్తము, ఓం తత్పురోమ్ =అదియే మొదటిది,
సర్వాధారము, నమః =దానికి నమస్కారము.
తా: ప్రణవస్వరూపమైన అదియే బ్రహ్మము, వాయువు, జీవితము, సత్యము, సర్వము, ఆద్యము, ఆధార భూతము అయి ఉన్నది. దానికి నమస్కారము.
27. అన్తశ్చరతి భూతేషు, గుహాయామ్ విశ్వమూర్తిషు
టీకా: అన్తః =లోపల, చరతి =సంచరించు చున్నది, భూతేషు =సమస్త ప్రాణుల యొక్క, గుహాయామ్ =రహస్య
స్థలములగు హృదయములు, విశ్వమూర్తిషు =సృష్టి మొట్టమే రూపముగా
కలది.
తా: విశ్వమంతయు తానే అయిన ఏ బ్రహ్మము –సమస్త ప్రాణుల యొక్క హృదయముల మధ్య
భాగముల చరించుచున్నదో –ఆ
28. త్వం యజ్ఞ్యస్త్వం వషట్కారస్త్వం మిన్ద్రస్తగ్o రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః
త్వం తదాప ఆపొజ్యోతీ రసో ౭ మృతం బ్రహ్మ
భూర్భువస్సువరోమ్
టీకా: త్వం =నీవే, యజ్ఞ్యస్త్వం =యజ్ఞ్యము రూపముగా కలవాడవు, వషట్కారః =హోమకాలమున హోతా అగ్నియందు
వ్రేల్చునపుడు చర్చించు మంత్ర శబ్దమువు, మిన్ద్రస్తగ్o
=దేవేంద్రుడవు నీవే,
రుద్రస్త్వం =ఈశ్వరుడవు నీవే, విష్ణుస్త్వం
=సర్వవ్యాపకూడవు నీవే,
బ్రహ్మత్వం= పరబ్రహ్మవు నీవే, ప్రజాపతిః =ప్రజలను సృష్టించువాడవు త్వం =నీవే , తత్
= తత్ శబ్ద వాచ్యమగు, ఆప =జలమువు, ఆపొ =జలమగు, జ్యోతీ
=తేజస్సువు, రసః
=రసమువు, అమృతం =నాశనము కలగనీయకుండు తత్వమువు, బ్రహ్మ =బ్రహ్మాండ రూపమువు, భూః
=భూలోకము, భువః= భువర్లోకము,సువః =సువర్లోకమును, ఓం
=ఓంకారమును,
తా: తచ్చబ్ద వాచ్యుడగు పరమేశ్వరా, నీవే యజ్ఞ్య రూపుడవు,
నీవే వషట్కారమువు, నీవే ఇంద్రుడవు,
విష్ణువు బ్రహ్మము నీవే, సర్వాధార సలిలమువు , ఆ జలముల తేజస్సువు, రసమువు,
నాశనము లేని వాడవు, నాశనము లేనట్లు చేయువాడవు, సమస్త బ్రహ్మాండ రూపుడవు, అన్నీ లోకముల ఏకాక్షర
బ్రహ్మమగు ఓంకారము నీవే అయి ఉన్నావు.
29. ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్
బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోమ్
టీకా: ఈశానః =ఈశానుడు(అను పేర) స్సర్వ విద్యానాం = అన్నీ విద్యాలకు అధిపతి,
ఈశ్వరః =యజమాని, సర్వభూతానామ్ =అన్నీ ప్రాణి కోతులకు, బ్రహ్మధిపతిర్ =బ్రహ్మకు
యజమానియు, బ్రహ్మణో
౭ ధిపతిర్ =బ్రహ్మజ్ఞ్యులకు యజమానియు, బ్రహ్మ =పరబ్రహ్మమైన, శివః =శివుడు, మే =నా యొక్క , అస్తు =అగు గాక,
సదా = నిత్యము, శివోమ్ =మంగళ ప్రదుడు
తా: ఈశానుడను పేర సర్వ విద్యాలకును, వేదములలోనూ సంస్త ప్రాణికోటిపై అధికారియు, బ్రహ్మజ్ఞ్యులకు శాసకుడును అగు పరమాత్మ సదా నన్ను అనుగ్రహించుటకు గాను
శాంతుడగు గాక.
30. తద్విష్ణో పరమం పదగ్o సదా పశ్యన్తి సూరయః
దివీవ చక్షు రాతతమ్
టీకా:తత్ =ఆ యొక్క, విష్ణోః= విష్ణువు యొక్క, పరమం పదగ్o
=దివ్యా నివాసమును, సదా = ఏళ్ల వేళలా, ,
సూరయః =జ్ఞ్యానులైనవారు, దివి+ఇవ =ఆకాశమందంతటను, చక్షుః =కన్నులకు, ఆతతం= వ్యాప్తముగా, పశ్యన్తి = చూచుదురు
తా: ఆ విష్ణువు యొక్క నివాస స్థానమగు వైకుంఠ పదమును –పండితులు తమ జ్ఞ్యానము
వలన దివ్యములగు కన్నులకు కట్టినట్లుగా ఆకాశమందంతటనూ చూచుచున్నారు.
31. తద్విప్రాసో విపన్వవో జాగృవాం స్సమిన్దతే
విష్ణోర్య త్పరమం పదమ్
టీకా: తత్ =ఆ యొక్క, విప్రాసో =నిష్కామ కర్మిష్టులగు
బ్రహ్మజ్ఞ్యులు,
విపన్వవో =నిష్కంటక జీవులు, జాగృవాం =నిర్భయులు, స్సమిన్దతే =ప్రదీప్తము చేయుచున్నారు, విష్ణోః =విష్ణువు యొక్క, పరమం పదమ్ =దివ్యా నివాసమగు వైకుంఠమును.
తా: విష్ణువు యొక్క శ్రేష్టమైన ఆ పరమ పదము –నిష్కామ కర్మ యోగులగు
బ్రహ్మజ్ఞ్యుల చేతను, కంటక రహిత జీవనుల చేతను, నిర్భయులగు జ్ఞ్యానుల చేతను, నిత్యము ప్రదీప్తము
చేయబడుచున్నది.
32. ఋతగ్o సత్యం పరమ్ బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్
ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః
టీకా: ఋతగ్o =మోక్షపదావాసము, సత్యం =యదార్ధముగాక కలిగినటువంటిది, పరమ్ బ్రహ్మ =వ్యవహారమున
చెప్పుకునే బ్రహ్మము గాక –పారమార్ధికమైన బ్రహ్మము, పురుషం =పురుషుడు, కృష్ణ పింగళమ్ =నలుపు ప్రకాశవంతమైన బంగారు
రంగులు కలది, ఊర్ధ్వరేతమ్ =రేతమును ఊర్ధ్వ గతికి నడుపునది, విరూపాక్షం =బేసి కన్నులు కలది, విశ్వరూపాయ వై =విశ్వమే రూపముగా
కలిగిన దైవమునకు,
నమో నమః= పునః నమస్కారము
తా: మోక్ష పదమందు ఉండు వాడు, సత్యమే స్వరూపమైన వాడు, పారమార్ధికమైన పర బ్రహ్మము, పురుషుడు, మెరుపు గల నలుపూ మరియు ప్రకాశమానమైన బంగారు రంగుల మిశ్రవర్ణ శోభితుడు, ఊర్ధ్వ రేతస్కుడు, మూడు కన్నులు కలవాడు, సృష్టి సమస్తమూ తన రూపమే అయిన మహాదేవునకు పునః నమస్కారము.
33. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్
టీకా: నారాయణాయ =నారాయణునిగా,
విద్మహే = ప్రకటించబడిన(పరమాత్ముడగు), వాసుదేవాయ =
వాసుదేవుని యొక్క,
ధీమహి = స్మరణము మా మనస్సు లందు జరుగు గాక, తన్నో =
ఏతత్ స్మరణ ప్రార్ధనలందు, విష్ణు =విష్ణువు, ప్రచోదయాత్ =ప్రేరేపించు గాక.
తా: పరమాత్ముడగు వాసుదేవునియందు ప్రకటించబడిన నారాయణ నామము నిత్యము స్మరింతుము
గాక. అట్టి స్మరణ ప్రార్ధనలకై విష్ణువు మమ్ములను ప్రేరేపించు గాక.
34. ఆకాశ త్పతితం తోయమ్ యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవమ్ ప్రతి గచ్ఛతి
టీకా: ఆకాశత్ =ఆకాశము నుండి, పతితం =పడినటువంటి(కురిసిన), తోయమ్ =నీరు, యథా = ఏ విధముగా నైతే సాగరం =సముద్రమున, గచ్ఛతి
=చేరునో, అట్లే, సర్వదేవ నమస్కారః =అందరి దైవములయోక్క నమస్కారములును, కేశవమ్ ప్రతి =విష్ణువునకే, గచ్ఛతి =చెందును.
తా: వాన నీరు ఎన్ని వాగు వంకలైనను కడలి చేరునట్లు,
ఏ దైవతములకు నమస్కరించినను అది విష్ణువుకే చెందును.
i felt the presence of God inside. i saw god in every living and non living thing. Everything is god. God and universe are same. The world is a manifestation, the reflection of God. God (energy) provides the fuel for this entire machinery.
ReplyDeleteచాలా బాగుంది. కేవలం పఠనం, పారాయణమే ఉత్తమగతికి మార్గం అనుకునే వారికి, నేపధ్యంలోని యదార్ధాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్ర పరిభాషలో చక్కని చిత్రాలతో సహా విశదీకరించిన మీకు కృతజ్ఞతలు.
ReplyDeleteమంచి ప్రయత్నం. చాలా బాగుంది. మీ కృషి నిరంతరం కొనసాగాలని హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన శ్లోకాలు ప్రచురించండి
ReplyDeleteచాలా బాగుంది. మీకు చాలా thanks.
ReplyDeleteఅద్భుతం
ReplyDeleteచాలా చాలా విపులంగా అర్థమగు రీతిలో ఉన్నది అద్భుతమైన రీతిలో
ReplyDelete