Tuesday, December 26, 2017

New Poetry - 28

ఆనంద తాండవం 

అసలే తత్వమునేమహం కదిలి యేశబ్దాన్వితాకాశమై 
మసలే భోనభ స్పర్శయేప్రిదిలి గాలై రూపమైనంతలో
రసమే నీరముకాగనే కలుగు గంధాంశమ్మునాపృథ్వియై
వెసలోనావరణించినా సకలమై మేథో వికాసమ్మునై 

మనసున తోచు చిత్రములు మాటలలోకి కుదించు కార్యమే 
ఘనముగ నిర్వహించుటకునై పరితప్త కవిత్వలాలసా 
నెనరులయాతనే చినుకునే చిని భాషన భావసారమై
ననచిన కావ్యఘోష నను సంతత మాధురినందు ముంచెనే

సరము వీచగ ధ్యానమే సుమగంధమై పసరించగా 
కరిగి మౌనము డోలలూగుచు భావమై కనిపించగా 
మరుల లోపల భావమే సిరి మాటలై అలరించగా 
అరులుపొంగుచు మాటలే ఇల కావ్యమై కుసుమించగా 

ఆత్మరాగమొక లయన కదలంగనే
విశ్వమంత నర్తన విలయాన 
హృదిన మొదలిడి తనువంత తాండవమునా 
డేను ఈశ్వర ఇది నీ దయేర 

అక్షరములు స్వరమై తమ 
వీక్షణముల ఊపిరి లయలే వెలయించే
ఆ క్షణముల ఆనంద ని 
రీక్షణమున విరియు భావమే కావ్యమయే 

స్వర సింజిని అనునాదపు టంకృతి మేథో 
పరి వేదపు అలలై ఇలపై వెలయించే 
సురపూజిత నవ భవ్య విశుద్ధ సరాగా 
మర కావ్య విలసితమ్మున మంథనమౌనే

హరుడే హరి అడపొడలన, నడిచే 
వరమే ఒసగిన, అజుడది పలికే 
సిరివీణల అలల కదులు రచనై 
మరి నాదపుసర అనురణనములై 



సర్వము లీలయే సరగు సర్వము నశ్వర మీశ్వరాభవం
ఖర్వము యేటికిం గలుగు సత్వము విశ్వపు జాలినీడయే
పర్వములెల్ల సంహతిన పంచుచు పెంచును సృష్టికార్యమై 
సర్వము అంతరించునిది సత్యము నిత్యము శాంతిభూషణా

తన్మాత్రామయమై విలోలభరమై సంరంభమై భవ్యమై 
చిన్మాత్రా పరిభాషలోననయు వైచిత్ర్యానుభావార్ధమై 
పెన్మాయానెలవై జగానలయమై వేళాన్వితాపృష్టియై
జన్మానాంతరమై సుగోచరమునై ఉత్కృష్టమై సృష్టియై 



ప్రశాంతం అజాండం విపాటేననంతం 
ప్రసారం అనూనం ప్రవాహం అమోఘం
విశాలం ప్రకంపం విరించే దిగంతం
లసత్సంసుధాపూరయంతం ప్రపంచం


Thursday, December 21, 2017

New Poetry -27

అమ్మ 

ఎన్ని బాధలొచ్చి ఎంత హింసించినా
ఖేద పడక వాటి తేట పర్చి
విజయ పథము పట్టు విజయమ్మ నా యమ్మ
మొసలికంటివారి బుచ్చి విజయ 


ఎక్కడున్నను తన పిల్లలే ప్రాణమై
వారి సుఖము కోరి వారి కొరకు 
ఉన్నదంతయుపంచి ఉన్న ఇరువురికీ
మురిసిన ఆ ప్రేమ బుచ్చి విజయ
ఏ వేళలోనైన ధైర్యమ్ము చెప్పగా
ఆమె పేరు తలచనదియె చాలు
ఇంత సంగతి ఏల విబుధబాంధవ రామ
ఎవరుకలరు నీకుఅమ్మ గాక 

దయను కను విషయాన హృదయమును కరి
గించి , ననుగన్న నా తల్లి బుచ్చి విజయ 
ఎవరి కైనను సాయము చేయు నెడల
నీది నాదను బేధము నియ్యదయ్య 

అమ్మను గురించి కొత్తగ 
పమ్ముట కేమున్నదయ్య పలుకగ ఇలలో 
అమ్మొక సత్యము నిత్యము 
అమ్మే నీ జన్మ మూలమమ్మే నిజమౌ

ఇలనైన కలనైన ఎవరైన కూడ, ఇసుమంత సందియమించుకైనాను
కలగనే కలగదే తల్లి పేరును తలప, ఉన్న భయములు బాపునా తల్లి 
తలపే, కనుగొనగ అదియెదో పేగు బంధము భువిన, విడగలేని గొప్ప 
అలయైన అనురాగ మభిమాన మౌను, జన్మ జన్మల సంత సంబంధమౌను


కమ్మని ప్రేమను క్రమ్మున పంచు 
అమ్మను మించిన దైవము లేదు 


ఎన్ని తప్పులు చేసినా నిను, కడుపు
లోపల దాచి కాచును, అమ్మ ఒకతె 
పుడమినందున, తెలుసుకొనగను నిజ 
మునిదియే, ఆమె దీవనభాగ్యమేర 


ఏజన్మ పుణ్యమో ఎంత చేసితినోతెలీదాయె 
ఈ జన్మలోన ఈతల్లి ఒడిలోన ఆటలాడేను
నా జన్మ జన్మల కర్మ నన్ను దీవించి కరుణన 
ఈ జన్మలోఈప్సితమును ఈడేర్చు అమ్మ నొసగెను


అసువులీయగ యజ్ఞమే ఇల ఆచరించును ధారగా 
కసుగునే నిజ జీవితం తన కన్న బిడ్డల సౌఖ్యమున్
విసిగి పోవక జీవితాంతము పీడ బాపుచు ఆమెతా 
నసికిపోవక వంశమంతయు కాచి బ్రోచును అమ్మరా 


ప్రేమావేశము కట్టతెంచగ నలై లేచేటి జీవామృతం
అమ్మాయంచు తలంచగా నవధులే దాటేటి ప్రేమామృతం
ఏమ్మాయో ఇదియా పరాత్పరుని అవ్యాజానురాగమ్ముయే 
అమ్మా నీ నిలుపై మహిన్కదలగా ఆనందమై పొంగునే 


అమ్మను పోలినట్టి మరియింకొక జీవిని కానలేవురా
ఇమ్మహిలోపలన్ వెతుక నీవిక, ఏ రకమైన ప్రాణియై
నా, మదికందునే కనగ అమ్మను చేరిక ఉల్లసిల్లునే
కమ్మని అమ్మ మాటల సుధారసమందున సంతసించునే


జగతిని అమ్మ ప్రేమకు సరైన మరొండు ప్రకర్ష యే కదా
మిగిలిన వన్ని జీవితము నీడ్చుటకున్ ఉపయోగమైనవే
దిగుముడి వంటివే ఎపుడు వీడి అధాటున పోవునో తెలీ
దు, కలిగి అమ్మనే తలచ నొక్కనిమేషము సంస్పృశించురా