Tuesday, July 23, 2019

New Poetry - 30


అవస్థ
మాటలలో చెప్పాలని నే చేసే మథనంలో
ప్రవహించే తలపుల రసాల ఝరిలో కవినై
వినిపించే నాదపు తీవల అలలో పవినై
ఛేదించే వెలుగుల వలలో తేలియాడుతూ
ఆద్యంతమైన గాంధర్వంలో, అణువుల
అల్లరి లోపల దారులలో చంక్రమణం చేస్తూ
ఆ సచ్చిదానంద అనుసంధానంలో కలిసి
ఓలలాడుతూ ఇలలో కలలా మైమరపించే
నిశ్శబ్ధంలో ఘనీభవించిన కాలంతో
కలిసిన ప్రజ్వల నిర్వికార తన్మయత్వం
ఆవరించిన ఆవర్తాల కలయాడుతూ
ఆ నిర్మల సురగంగా పానం వదిలి
తలుపులు తెరిచి వెలికివచ్చి ప్రకటితమయ్యే
రంగులలో, రాగంలో , వాసనలో, స్పర్శలో
వెతుకులాడి వేసారే నా ఆహాన్ని బుజ్జగిస్తూ
పరిగెడుతూ నే చేసే యుధ్ధంలో, ఇహంలో
గెలవాలని, తరగని జ్ఞ్యాపకమై మిగలాలని
కోరికతో ఖేదిస్తూ, బేధించే వేదనలో బాధలో
రోదిస్తూ, చెరగని మరకల తరగల తీరం
దాటాలని ఆరాటంతో  పోరాటం చేస్తూ
ఎదురొచ్చే అన్నిటిలోనూ ఆ అద్భుతాన్ని
కనుగొనాలని పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ
ఒక సమతుల్యత సాధించాలని సంకల్పిస్తూ
మాటలలో చెప్పాలని నే చేసే మథనంలో
ప్రవహించే తలపుల రసాల ఝరిలో కవినై