ప్రతీ వాడి జీవితంలోను వాడికి మంచి అనిపించేవి , చెడు అనిపించేవి రెండూ ఉంటాయి. General గా అందరు మంచి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. చెడ్డవి పెద్ద ప్రయత్నం లేకుండానే గుర్తు ఉండిపోతాయి. నా జీవితం దీనికి పెద్ద exception ఏమీ కాదు. Memories వ్రాద్దామని మొదలుపెట్టగానే నాకు నచ్చనివన్నీ గుర్తుకు వచ్చాయి ముందు.
ఎన్నో హృదయ భేదకాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో నిస్పృహలు, కొన్ని ఆనందకరమైన సంఘటనలు అంతే. ఒక middle class ఆంధ్ర కుర్రాడి జీవితంలో ఎన్ని విషయాలు ఉండచ్చో అన్నీ. ఇవన్నీ ఎందుకు వ్రాద్దామనిపించిందంటే నాలాటి ఆలోచనలతో ఒక జీవి ఎలా తయారవుతాడు, వాడి వెనక ఏ బలమైన సంఘటనలు, సంతులేముంటాయి అని నాకు నేనే చూసుకోవాలని వ్రాసుకుంటున్న ఆత్మకథ.
కొన్ని తల్లి తండ్రులతో పంచుకోగలం. కొన్ని స్నేహితులతో, మరికొన్ని జీవన సహచరులతో. కాని కొన్ని ఎవరితోనూ పంచుకోలేము. అవి నీలోనే ఒక చీకటి కోణంలో దాగుండి నిన్ను బాధపెడుతో నీతోనే అంతం అయిపోతాయి. నీకు నువ్వు మాత్రమే justify చేసుకోవాలి. నీ మనసుకి, ఆలోచనకి, ఆచరణకి ఎంత దగ్గరతనం తీసుకురాగలిగితే అంత స్వచ్చమైన నవ్వు నీ ముఖం లో కనిపిస్తుంది.
ఒక sex పుస్తకం చదువుతూ తల్లి తండ్రులకి దొరికిపోవడం, నువ్వు ఇచ్చే మొదటి ప్రేమలేఖ నీకు నచ్చిన అమ్మాయి చింపి అసహ్యించుకోవడం, తల్లి తండ్రులు frustations లో కొట్టుకోవడం, తల్లో/ తండ్రో లేని జీవితాలు,వాళ్ళ extra marital affairs ,incest , exams fail అవ్వడం, స్నేహితుల egos ,వాళ్ళ వెన్నుపోట్లు, బంధువుల వెటకారాలు, బాగా బ్రతికిన పరిస్థితులలోంచి ఒక సారి కటిక బీదరికం లోకి వెళ్ళిపోవడం, నిన్ను seduce చేసే పొరుగువాడి పెళ్ళాం/పక్కింటి అమ్మాయి, ఉమ్మడి కుటుంబాల తగువులు,ఆస్తుల కోసం కాట్లాడుకొనే రక్త సంబంధాలు, ఏదో అయిపోదామని ఎలాగో ప్రయత్నిస్తే ఇంకేదో తయారవడం, ఇలాటివే ఎన్నో - ఇందులో ఏదో ఒకటైన లేని middle class ఆంధ్ర కుర్రాడు నా generation లో నాకు కనపడలేదు. నాకు అమ్మాయిల జీవితాలతో, వాళ్ళ ఆలోచనలతో పెద్ద పరిచయం లేదు. నేను కిశోరన్న, రాంబాబు కళ్ళతోనే అమ్మాయిల ప్రపంచాన్ని చూశాను.సరే ఇందులో నీ జీవితంలో ఏమున్నాయని మాత్రం నన్ను అడగద్దు.
నాకు బాగా గుర్తుండిపోయిన నా చిన్నప్పటి మొదటి జ్ఞ్యాపకం. నాకు రెండేళ్లో, మూడేళ్లో, అప్పుడే నడక వచ్చింది. మా అమ్మతో పాటు మా తాతగారి స్వస్థలమైన అమలాపురం దగ్గిర బిళ్ళకుర్రు అనే పల్లెటూరు లో ఉన్నాము. మా పట్టాభిమామ కొడుకు పెద్ద నర్సింగు "ఒరే మీ నాన్నగారు వచ్చారు తెలుసా" అన్నాడు. నాకు ఎందుకో బోలెడంత సిగ్గు, భయం వచ్చేసింది. వంటింట్లో తలుపు వెనక్కాల దాక్కున్నాను. మా నాన్నగారు పెరట్లో అరుగు మీద కూర్చుంటే వీడు నన్ను తీసుకు వచ్చి మా నాన్నగారి ముందు నిలబెట్టాడు. ఆయన రెండు చేతులూ సాచి నన్ను దగ్గిరకి తీసుకున్నారు. చాలా comfort అనిపించింది. నేను ఎంత intensity feel అయ్యానంటే అది తలుచుకుంటే ఇప్పటికీ ఆ feeling నాలో తంతుంది. అంతవరకే గుర్తు. తరవాత మళ్ళీ గుర్తు లేదు. ఆ తరువాత మా నాన్నగారి దగ్గిర ఆ feeling కోసం ఎంతో వెతికే వాడిని. మళ్ళీ కనపడలేదు. ఆయన ఎప్పుడూ ముభావంగా ఉండేవారు. కష్టానికైన, సుఖానికైనా మా అమ్మ దగ్గిరే చనువు ఎక్కువ.
సశేషం